(ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి ఆగస్టు 25)
ఎల్లారెడ్డి: కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి మృతి సీపీఎం పార్టీకి, రైతాంగ ఉద్యమానికి తీరని లోటని సీపీఎం ఎల్లారెడ్డి ఏరియా కార్యదర్శి మోతి రామ్ నాయక్ అన్నారు. మల్లారెడ్డి చిత్రపటానికి సీపీఎం కమిటీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మోతి రామ్ నాయక్ మాట్లాడుతూ.. సారంపల్లి మల్లారెడ్డి జీవితాంతం రైతుల కోసం త్యాగపూరితంగా పనిచేశారని అన్నారు. రైతుల సమస్యలు, పంటలకు సంబంధించిన అంశాలు, ప్రభుత్వ సహకారం తదితర విషయాల్లో ప్రభుత్వాలకు అనేక సలహాలు, సూచనలు అందించారని తెలిపారు. జాతీయ స్థాయిలో కిసాన్ సంఘం ఉపాధ్యక్షుడిగా మూడు దఫాలు ఎన్నికై రైతుల కోసం విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమంలోనూ మల్లారెడ్డి అగ్రభాగాన నిలబడి పోరాడారని అన్నారు. తన కుటుంబాన్ని కూడా పార్టీ భావజాలంతో తీర్చిదిద్దిన గొప్ప నాయకుడని కొనియాడారు. రైతు రంగానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని, ప్రజా సమస్యలపై పోరాటాలను రూపొందించడంలో, వాటిని ముందుకు తీసుకెళ్లడంలో ఆయనకు విశేష అనుభవం ఉందన్నారు. ఆయనను ఒక విప్లవ యోధుడిగా అభివర్ణించారు.
అనంతరం సీపీఎం నాయకులు, కార్యకర్తలు మల్లారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ మండల నాయకులు ప్రకాష్ నాయక్, కిషన్ రావు, మధు, జోహర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
సారంపల్లి మల్లారెడ్డి మృతి సీపీఎం పార్టీకి తీరని లోటు
RELATED ARTICLES
