ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 10
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో ప్రజా పాలన ప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం 10వ వార్డులో వార్డు సభ నిర్వహించారు. ఈ సభకు మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ అధ్యక్షత వహించగా, మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
సభలో వార్డు ప్రజలు తమ ప్రాంతాల్లో ఉన్న పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా డ్రైనేజీలలో పేరుకుపోయిన చెత్త, మురుగు కాల్వల నిర్వహణ లోపాలు, మూళ్ల పొదల పెరుగుదల, విద్యుత్ సరఫరా అంతరాయాలు, వీధి దీపాల సమస్యలు, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ మాట్లాడుతూ వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతి వార్డులో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. డ్రైనేజీలను పూర్తిస్థాయిలో శుభ్రపరిచి మురుగు నీరు ఎక్కడా నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే మున్సిపాలిటీ ప్రధాన లక్ష్యమని, ప్రతి సమస్యను ప్రాధాన్యత ఆధారంగా పరిష్కరిస్తామని తెలిపారు.
మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ మాట్లాడుతూ ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. వర్షాకాలంలో దోమల వ్యాప్తి, అంటువ్యాధుల నివారణ కోసం పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా అందించి మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని ప్రజలను కోరారు. అలాగే వార్డులలో ఉన్న డ్రైనేజీలు, కాల్వలు, విద్యుత్ సమస్యలు, వీధి దీపాల సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మున్సిపల్ ఏఈ వినోద్ కుమార్ మాట్లాడుతూ మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన పనులను వేగవంతం చేస్తామని తెలిపారు. విద్యుత్ శాఖ ఫోర్‌మెన్ గంగాధర్ మాట్లాడుతూ విద్యుత్ సరఫరాకు సంబంధించిన సమస్యలను వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడతామని పేర్కొన్నారు.
వార్డు ప్రజలు తమ సమస్యలను సభలో వివరించగా, సంబంధిత శాఖల అధికారులు వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజా భాగస్వామ్యంతోనే వార్డుల అభివృద్ధి సాధ్యమవుతుందని వక్తలు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్, మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, మున్సిపల్ ఏఈ వినోద్ కుమార్, విద్యుత్ శాఖ ఫోర్‌మెన్ గంగాధర్, వార్డ్ ఆఫీసర్ అంజయ్య, పప్పు వెంకన్న, మెప్మా ఆర్పీలు, వార్డు సభ్యులు, మున్సిపల్ సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
వర్షాకాల సమస్యల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలి మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్
RELATED ARTICLES
