ePaper
Friday, July 17, 2026
ePaper
Homeఎడిటోరియల్ఏడాది పూర్తయిన సందర్భంగా పోరాటాన్ని గుర్తు చేసుకుంటున్న పరిశోధకులు ఉపాధి హామీ కూలి నుంచి గవర్నర్...

ఏడాది పూర్తయిన సందర్భంగా పోరాటాన్ని గుర్తు చేసుకుంటున్న పరిశోధకులు ఉపాధి హామీ కూలి నుంచి గవర్నర్ చేతుల మీదుగా పీహెచ్‌డీ పట్టా వరకు.

📰 Generate e-Paper Clip

(ప్రతీయ వార్త ప్రతినిధి రవి జులై 17)

నిరుపేద కుటుంబంలో జన్మించి, జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, ఉపాధి హామీ కూలిగా పనిచేసిన స్థాయి నుంచి రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా పీహెచ్‌డీ పట్టా అందుకునే స్థాయికి ఎదిగిన డాక్టర్ పీబీ సత్యం ప్రస్థానం పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. వ్యక్తిగత విజయంతో పాటు, తెలంగాణ యూనివర్సిటీలో పీహెచ్‌డీ పూర్తి చేసిన వందలాది మంది పరిశోధకులకు న్యాయం జరిగేలా ఉద్యమించి రెండో కన్వొకేషన్ నిర్వహణకు మార్గం సుగమం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

కష్టాల మధ్య విద్యాభ్యాసం

కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రానికి చెందిన డాక్టర్ పీబీ సత్యం చిన్న వయస్సులోనే తండ్రిని కోల్పోయారు. నిరక్షరాస్యురాలైన తల్లి, చిన్నప్పుడే పోలియో బారినపడి వికలాంగుడైన అన్నయ్యతో కూడిన కుటుంబ పరిస్థితుల్లో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూనే విద్యను కొనసాగించారు. ఉన్నత విద్యను లక్ష్యంగా పెట్టుకుని తెలంగాణ యూనివర్సిటీలో సోషల్ వర్క్ విభాగంలో పరిశోధన పూర్తి చేసి డాక్టరేట్ పొందారు.

విద్యార్థి నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు

2013 నుంచి 2023 వరకు తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా చురుకుగా పనిచేసిన డాక్టర్ సత్యం, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి అనేక ఉద్యమాలు చేపట్టారు. పరిశోధక విద్యార్థుల సమస్యలను యూనివర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేశారు.

రెండో కన్వొకేషన్ కోసం ఉద్యమం

తెలంగాణ యూనివర్సిటీలో తొలి కన్వొకేషన్ 2013లో జరిగినప్పటికీ, అనంతర కాలంలో పీహెచ్‌డీలు పూర్తి చేసిన పరిశోధకులకు రెండో కన్వొకేషన్ నిర్వహించలేదు. 2024లో వైస్‌చాన్సలర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ యాదగిరి రావును డాక్టర్స్ అసోసియేషన్, పలు విద్యార్థి సంఘాలు, డాక్టర్ పీబీ సత్యం నాయకత్వంలో కలిసి రెండో కన్వొకేషన్ నిర్వహించాలని కోరాయి.

అయితే, 2023–24 విద్యా సంవత్సరంలో పీహెచ్‌డీ పూర్తి చేసిన వారికి మాత్రమే అవకాశం కల్పిస్తామని యూనివర్సిటీ సర్క్యులర్ జారీ చేయడంతో పరిశోధకుల్లో అసంతృప్తి వ్యక్తమైంది.

జేఏసీ ఏర్పాటు… ‘చలో తెలంగాణ యూనివర్సిటీ’ పిలుపు

ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ డాక్టర్ పీబీ సత్యం ఆధ్వర్యంలో “తెలంగాణ యూనివర్సిటీ రెండో కన్వొకేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ)” ఏర్పాటు చేశారు. కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన, వైస్‌చాన్సలర్, రిజిస్ట్రార్, డీన్లు, ప్రిన్సిపాళ్లకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించి ఇప్పటివరకు పీహెచ్‌డీ పూర్తి చేసిన అందరికీ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.

స్పందన రాకపోవడంతో “చలో తెలంగాణ యూనివర్సిటీ ముట్టడి” కార్యక్రమాన్ని ప్రకటించారు. దాదాపు 300 మంది పరిశోధకులు, విద్యార్థులు ఉద్యమానికి సిద్ధమవడంతో యూనివర్సిటీ యాజమాన్యం అత్యవసర సమావేశం నిర్వహించింది.

అందరికీ అవకాశం… పరిశోధకుల్లో హర్షం

ఉద్యమం నేపథ్యంలో యూనివర్సిటీ అధికారులు నిర్ణయాన్ని మార్చుకొని, ఇప్పటివరకు పీహెచ్‌డీ పూర్తి చేసిన అందరికీ రెండో కన్వొకేషన్‌లో అవకాశం కల్పించారు. దీంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన పరిశోధకులు హర్షం వ్యక్తం చేశారు. అందరికీ సమాన అవకాశం కల్పించేందుకు కృషి చేసిన డాక్టర్ పీబీ సత్యంను అధ్యాపకులు, పరిశోధకులు, డాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు, విద్యార్థి సంఘాల నాయకులు అభినందించారు.

గవర్నర్ చేతుల మీదుగా పీహెచ్‌డీ పట్టాలు

2025 జూలై 16న డిచ్‌పల్లి ప్రధాన క్యాంపస్‌లో తెలంగాణ యూనివర్సిటీ రెండో కన్వొకేషన్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా దాదాపు 350 మంది పరిశోధకులకు పీహెచ్‌డీ పట్టాలు, గోల్డ్ మెడల్స్‌ను అప్పటి తెలంగాణ, ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ శ్రీ జీష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం తెలంగాణ యూనివర్సిటీ చరిత్రలో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచింది.

ఏడాది పూర్తయిన వేళ.పోరాటానికి గుర్తింపు

రెండో కన్వొకేషన్ విజయవంతంగా జరిగి నేటితో ఏడాది పూర్తయిన సందర్భంగా పరిశోధకులు ఆ చారిత్రాత్మక ఘట్టాన్ని గుర్తు చేసుకుంటున్నారు. వ్యక్తిగత విజయాన్ని సామూహిక విజయంగా మార్చిన డాక్టర్ పీబీ సత్యం నాయకత్వం, పరిశోధకుల హక్కుల కోసం చేసిన ఉద్యమం తెలంగాణ యూనివర్సిటీ చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలిచిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!