ePaper
Monday, June 29, 2026
ePaper
Homeఎడిటోరియల్రాష్ట్రాల మధ్య తేడాల సంగతేంటి..!?

రాష్ట్రాల మధ్య తేడాల సంగతేంటి..!?

📰 Generate e-Paper Clip

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 27


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
నారా చంద్రబాబు నాయుడు,
తెలంగాణ ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి..ఆ ఇద్దరి
మధ్య ఉన్న స్నేహసంబంధాలు ఇరు రాష్ట్రాల మధ్య కనిపించడం లేదు..ఆ ఇద్దరూ వేర్వేరు పార్టీలకు చెందిన నాయకులే అయినా మొన్నటి వరకు ఒకే గూటి పక్షులు..నిజానికి రేవంత్ రెడ్డికి చంద్రబాబు గురువు వంటి వారు..ఒకనాడు చంద్రబాబు కోసమే రేవంత్ ఓటుకు నోటు
వివాదంతో తలనొప్పి తెచ్చుకుని అదృష్టవశాత్తు బయటపడ్డారు..
ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం..ఆయన చేరిన
ముహూర్తాన తెలంగాణలో
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి..
ఆయన ముఖ్యమంత్రి కావడం ఒకదాని వెంట ఒకటిగా జరిగిపోయాయి.

రేవంత్ అంటే గుర్రాలకు
శిక్షణ(అశ్వ శిక్షకుడు) ఇచ్చేవాడు అని అర్థం..
అలా తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్  పార్టీకి గెలుపు
గుర్రమై నిలిచారు.

ఇప్పుడు అసలు
కథలోకి వద్దాం..రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక
తెలంగాణ..ఆంధ్ర మధ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయనే అంశంపై
అప్పట్లో పెద్ద చర్చే సాగింది.

ఆంధ్రప్రదేశ్ అంటే పన్నెండేళ్ళ క్రిందటి వరకు ఒకటే పేరు..
ఒకటే గొడుగు..
కలిసి అడుగు..
తెలుగువాడంటే పిడుగు..!

సరే..తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్ష ..చిరకాల స్వప్నం నిజమై..ఇటు ఆంధ్ర ప్రజలు కలిసే ఉందామని ఎంతగా మొత్తుకున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీలిపోయి
నవ తెలంగాణ.. నవ్యాంధ్ర అవతరించాయి.
అది ఇప్పుడు చరిత్రే..!

రెండుగా విడివడిన తర్వాత
కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణలో టీఆరెఎస్ అధికారంలోకి వచ్చి
ఆ పార్టీ అధినేత..ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు
తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.ఉమ్మడి రాష్ట్రాన్ని తమ అభీష్టానికి వ్యతిరేకంగా విడగొట్టిన కాంగ్రెస్ పార్టీపై అక్కసుతో ఆంధ్ర ప్రజలు
దశాబ్దాల పాటు భుజాన ఎత్తుకుని మోసిన కాంగ్రెస్ పార్టీని నామరూపాల్లేకుండా తిప్పికొట్టి ఆ పార్టీ కంటే కొంత నయం కదాని తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు.
అలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నాయకుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మిగిలిపోతే
నవ తెలంగాణకు కేసీఆర్..
నవ్యాంధ్రకు నారా చంద్రబాబు నాయుడు మొదటి ముఖ్యమంత్రులుగా
పాలన సాగించారు.
ఇద్దరూ ఒక తానులోని ముక్కలే.

ఆ తర్వాత తెలంగాణలో మార్పు చోటు చేసుకుంది.
అక్కడ పదేళ్ల పాటు రాజ్యం చేసిన టీఆరెఎస్ గత ఎన్నికల్లో పరాజయం పాలుకాగా తెలంగాణ ఆవిర్భావానికి బాటలు వేసిన కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది.అంతకు కొంత మునుపటి వరకు
తెలుగుదేశం పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడి హోదాలో తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన తర్వాత
రెండు రాష్ట్రాలకు
తొలి ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వహించిన
కేసీఆర్..చంద్రబాబు నాయుడు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి.నేతల మధ్య విబేధాలు రాష్ట్రాల నడుమ సంబంధాలపై కూడా ప్రభావం చూపాయి.ఉమ్మడి రాజధానిగా హైదరాబాదును
పదేళ్ల వరకు
వినియోగించుకునే అవకాశం ఉన్నా కేసీఆర్ పంచన ఉండడం ఇష్టం లేకనే చంద్రబాబు తొందరగా నిర్ణయాలు తీసుకుని ఆంధ్రప్రదేశ్ పాలనను అమరావతికి తెచ్చేసారు.
అలాగే హైకోర్టును కూడా.

ఇదిలాఉంటే 2019 ఎన్నికల్లో
ఆంధ్రప్రదేశ్  లో జగన్మోహన రెడ్డి నేతృత్వంలో
వైసిపి ప్రభుత్వం ఏర్పడ్డాక
జగన్..కేసీఆర్ చెలిమి
ఒక అయోమయ వ్యవహారంగానే
మిగిలింది తప్ప ఉభయ రాష్ట్రాలకు ఆ ఇద్దరి స్నేహం కారణంగా ఒరిగిందేమీ లేదు.

మళ్ళీ కథ మారింది. తెలంగాణలో పాత సీసాలో కొత్త సారా..అక్కడ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్..ఎన్నో ఢక్కీ మొక్కీలు చూసిన చారిత్రక పార్టీ..ముఖ్యమంత్రి మాత్రం
తెలుగుదేశం నుంచి వచ్చిన
రేవంత్ రెడ్డి.

రేవంత్ రెడ్డి తెలుగుదేశం నుంచి బయటకి వచ్చి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నా గాని ఆయనకి మాతృ సంస్థ తెలుగుదేశం పట్ల వ్యతిరేకత లేదు.అలాగే చంద్రబాబు అంటే  గౌరవం ఉంది.
రేవంత్..బాబు చెలిమి ఉభయ రాష్ట్రాలకు ఉపయోగపడే అవకాశం ఉంటుందని భావించినా
ఇప్పటివరకు
అలా ఏమీ జరగలేదు..

ముఖ్యమంత్రులు ఇద్దరూ
బాగానే ఉన్నారు.
ఇప్పటికిప్పుడు ఒక కార్యక్రమంలో చంద్రబాబు రేవంత్ రెడ్డిని..
బదులుగా రేవంత్ రెడ్డి చంద్రబాబుని పొగడ్తలతో
ముంచెత్తారు.రేవంత్ డైనమిక్
లీడర్ అని బాబు కితాబిస్తే..
చంద్రబాబు దేశంలోనే అత్యంత సీనియర్ నాయకుడని రేవంత్ రెడ్డి
తన మాజీ నాయకుణ్ణి
ప్రశంసలతో ముంచెత్తారు.

ఇదంతా బాగానే ఉంది..
కానీ ఈ పరస్పర పొగడ్తల వల్ల
ఉభయ రాష్ట్రాలకు..
ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రయోజనం
ఏంటి..

మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటనను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడ్డుకున్నప్పటి నుంచి ఉభయ రాష్ట్రాల మధ్య స్వల్ప ఉద్రిక్తతలు
మొదలయ్యాయి..ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు.
ఇది ఎంతమాత్రం మంచి పరిణామం కాదు..ఈ ధోరణి
మరింతగా ముదిరితే
ఊహించని పరిణామాలు ఎదురు కావొచ్చు..
ఈ విభేదాలను ఇప్పుడే తుంచవలసిన బాధ్యత
ఇద్దరు ముఖ్యమంత్రులకు ఉంది.ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఉన్న మంచి స్నేహం ఒకరినొకరు పొగుడుకోడానికి మాత్రమే గాక రెండు రాష్ట్రల మధ్యన సంబంధాలు పాడైపోకుండా  వినియోగించవలసిన అవసరం ఎంతైనా ఉంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!