ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 19
కామారెడ్డి జిల్లా పరిధిలో అర్హత సాధించిన జర్నలిస్టులకు 2026–2028 సంవత్సరాలకు సంబంధించిన తొలి విడత మీడియా అక్రిడిటేషన్ కార్డులను జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఛైర్మన్, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అదనపు కలెక్టర్ విక్టర్‌తో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంతో జిల్లాలో నూతన మీడియా అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించారు.
జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు, పాత్రికేయ మిత్రులకు కలెక్టర్ స్వయంగా కార్డులను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్టులు ప్రజలకు నిజనిజాలను చేరవేసే బాధ్యతతో మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారిణి, కమిటీ కన్వీనర్ బి. తిరుమల, మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు రజనీకాంత్, ఉక్కల్ కర్ రాజేందర్ నాథ్, సయ్యద్ కౌసర్ అలీ పాల్గొన్నారు. అనంతరం పాత్రికేయ మిత్రులు హరీష్, శ్రీనివాస్ తదితరులు కలెక్టర్‌ను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.
