ePaper
Tuesday, June 30, 2026
ePaper
Homeఎడిటోరియల్ప్రేమ వేధింపుల ఆరోపణలతో యువకుడికి అరగుండు.. చెప్పుల దండతో ఊరేగింపు

ప్రేమ వేధింపుల ఆరోపణలతో యువకుడికి అరగుండు.. చెప్పుల దండతో ఊరేగింపు

📰 Generate e-Paper Clip



ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 22

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపూర్ జిల్లాలో ఓ యువకుడిని గ్రామస్తులు అవమానకరంగా ఊరేగించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో ఓ వివాహితను వేధిస్తున్నాడనే ఆరోపణలతో గ్రామస్తులు యువకుడికి అరగుండు కొట్టించి, మెడలో చెప్పుల దండ వేసి గ్రామ వీధుల్లో డప్పులు మోగిస్తూ ఊరేగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ సంఘటన అనంతపురం జిల్లా గడేకల్ల్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు భాస్కర్ అనే యువకుడు ఓ వివాహితను గత కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు పలుమార్లు హెచ్చరించినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో మహిళ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది. గ్రామస్తుల కథనం ప్రకారం, భాస్కర్ మరియు ఆ మహిళ గతంలో ప్రేమించుకున్నారని సమాచారం. అయితే కుటుంబ పరిస్థితుల కారణంగా ఆమెకు మరొకరితో వివాహం జరిగింది. పెళ్లి అనంతరం కూడా భాస్కర్ ఆమె వెంటపడటం కొనసాగించాడని స్థానికులు చెబుతున్నారు. దీంతో కుటుంబంలో తరచూ గొడవలు చోటుచేసుకున్నాయని, చివరకు మహిళ భర్త ఆమెను పుట్టింటి వద్ద వదిలి వెళ్లిపోయాడని సమాచారం. తమ కుమార్తె దాంపత్య జీవితం చెడిపోవడానికి భాస్కర్ వేధింపులే కారణమని భావించిన మహిళ కుటుంబ సభ్యులు అతడిని పట్టుకుని గ్రామ మధ్యలోకి తీసుకొచ్చారు. అక్కడ అతనికి దేహశుద్ధి చేసి, అరగుండు కొట్టించారు. అనంతరం మెడలో చెప్పుల దండ వేసి గ్రామ వీధుల్లో ఊరేగించారు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో విషయం బయటపడింది. వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు మహిళను వేధించిన వ్యక్తికి తగిన శిక్ష పడిందని అభిప్రాయపడుతుండగా, మరికొందరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరైంది కాదని అంటున్నారు. తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే కానీ, ఇలాంటి అవమానకర శిక్షలు సమంజసం కాదని సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు ఈ ఘటనపై యువకుడి కుటుంబ సభ్యులు అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేయలేదని సమాచారం. అయితే వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్వయంగా విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్న పోలీసులు గ్రామస్తుల చర్యలపై చట్టపరమైన కోణంలో పరిశీలిస్తున్నట్లు సమాచారం.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!