(ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 18.)
ప్రతి వ్యక్తిలో అపారమైన అంతర్గత శక్తి ఉంటుంది. ఆ శక్తిని శోధనతో, సాధనతో పెంపొందించుకుని దివ్యత్వం వైపు పురోగమించాలి.
*ముఖ్యమైన అంశాలు:*
1. *అంతర్గత దివ్యత్వం*:
మనలోని అంతర్గత దివ్యత్వాన్ని చైతన్యవంతం చేసి లక్ష్యం దిశగా పయనించడంలో ఆధ్యాత్మికత కీలక భూమిక పోషిస్తుంది. తనను తాను ఉద్ధరించుకోవాలనుకునే వారికి దైవం సహకరిస్తుంది. ప్రయత్నహీనులకు మాత్రం కార్యసాఫల్యం లభించదు. దైవభక్తి కలిగి ఉన్నంత మాత్రాన ప్రయత్నాలన్నీ సఫలం కావు. మానవ ప్రయత్నాన్ని మేళవించాలి.
2. *ఉత్తమ వ్యక్తిత్వం*:
సత్ప్రవర్తనతో, మంచి మనస్తత్వంతో, ఉత్తమ నడవడికతో మసలుకునేవారికి విజయాలు స్వాగతం పలుకుతాయి. క్షమ, సహనం, ప్రేమ, సత్యం, వినయం, సేవా భావం వంటి ఉత్తమ అంశాలతో కూడుకున్న వ్యక్తిత్వం సర్వదా శోభిల్లుతుంది.
3. *భగవద్గీత బోధ*:
సాటివారి పట్ల సమాదరణ కనబరిచేవారు, ప్రకృతి పట్ల మైత్రీభావం కలిగినవారు, అహంకార రహితంగా సాధువర్తనతో ప్రవర్తించే వారు, సుఖదుఃఖాల్లో సమభావాన్ని ప్రదర్శించే వారు తనకు అత్యంత ఆప్తులని శ్రీకృష్ణుడు స్పష్టం చేశాడు. కర్మయోగులు, కార్యసాధకులు సమస్త ప్రపంచాన్ని భగవత్ స్వరూపంగా దర్శిస్తారు.
4. *జీవితమే సాధన*:
ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మజ్ఞానానికి ఎంతో ప్రాధాన్యముంది. జీవితంలో సాధన ఒక భాగంగా మిగిలిపోకూడదు. జీవితాన్నే ఒక సాధనగా కొనసాగించడం ద్వారా అద్భుతాలను ఆవిష్కరించవచ్చు. క్లిష్టంగా ఉన్నప్పటికీ కాలక్రమంలో మేలుచేసే మార్గాన్ని అవలంబించాలి.
5. *విజయం అంటే ఏమిటి?*
జీవితంలో విజయం సాధించడమంటే అపారంగా ధనాన్ని కూడబెట్టడం, విలాసవంతమైన భవనాలు నిర్మించుకోవడం మని కొందరు భావిస్తారు. అవి అవసరమే కానీ, అవే జీవిత లక్ష్యాలు కాకూడదు. జీవితంలో ప్రతి మజిలీ ఎన్నో అనుభూతుల పరిమళాలను ఆవిష్కరిస్తుంది. నిజాయితీతో ఎంత ఆనందంగా, పరిపూర్ణంగా జీవితాన్ని ఆస్వాదించాం అనేదానిపై దాని సార్థకత ఆధారపడి ఉంటుంది.
6. *జీవన మార్గం*:
తనను తాను తెలుసుకుంటూ, లోపాలను సవరించుకుంటూ, సత్యపథంలో పురోగమించాలి. జీవితాన్ని వైకుంఠపాళితో పోల్చారు. జీవన గమనంలో అవకాశాల నిచ్చెనలుంటాయి, అమాంతం దిగమింగే ప్రలోభాల మిన్నాగులూ ఉంటాయి. వేటిని అందిపుచ్చుకోవాలి, వేటిని విడనాడాలి అనేది మన విచక్షణపైనే ఆధారపడి ఉంటుంది.
*ముగింపు సందేశం:*
జీవితమంటే తెరిచిన పుస్తకంగా, వడ్డించిన విస్తరిగా భావించరాదు. ప్రయత్నశీలతతో, కృషి, పట్టుదలతో జీవితాన్ని నేర్పుగా, ఓర్పుగా తీర్చిదిద్దుకోవడంపైనే విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. *ఒక దీపం వెలుగుతుంటేనే మరో దీపాన్ని వెలిగించవచ్చు.* సమాజంలో నిరంతరం చైతన్యంతో ప్రజ్వలిస్తుంటేనే చేతనత్వంతో ఆదర్శప్రాయంగా వర్ధిల్లవచ్చు. జీవితానికి ఆధ్యాత్మిక పరిమళాలను ఆపాదించుకోవడం ద్వారా మాననీయ, మానవీయ విలువలతో గుబాళించవచ్చు
రచయిత
రవీందర్..
