PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 16 May 2026, 8:32 pm Posted by : RAVINDAR

హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు.

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 27

 

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ఎలాంటి పొరపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు.

శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్ విక్టర్, సంబంధిత అధికారులు, తదితరులు కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హల్ నుండి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం అమలుకు కార్యాచరణ విడుదల చేసిందని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా జూన్ 15 నుంచి 24 వరకు సంబంధిత సిబ్బంది, అధికారులకు శిక్షణ, ఎన్యూమరేషన్ ఫారాల ముద్రణ తదితర ఏర్పాట్లు చేపట్టనున్నట్లు చెప్పారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటికి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేసి, తిరిగి సేకరించే ప్రక్రియ నిర్వహిస్తారని తెలిపారు.

జూలై 24లోగా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ పూర్తి చేసి, జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురిస్తారని వెల్లడించారు. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాల స్వీకరణ, సెప్టెంబర్ 28 వరకు వాటి పరిష్కారం చేపట్టి, అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.

ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రారంభానికి ముందే ఓటర్ల మ్యాపింగ్ పూర్తి చేయాలని, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఆబ్సెంట్, షిఫ్ట్, డెత్ సంబంధిత ఫారం-6, 7, 8 దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు.

పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణలో భాగంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో 1,200 మందికి మించకుండా ఓటర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బూత్ స్థాయి అధికారుల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు, దివ్యాంగ ఓటర్ల నమోదుపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

మీడియా, సోషల్ మీడియా ద్వారా వచ్చే ప్రతికూల వార్తలపై వెంటనే స్పందించి, తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవాలని అధికారులను అప్రమత్తం చేశారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం దృష్ట్యా జిల్లాలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేస్తున్నామని, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. అలాగే కార్యక్రమంపై సిబ్బంది, అధికారులకు అవసరమైన శిక్షణ అందిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ సమావేశంలో తహసీల్దారులు, ఎన్నికల సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.