(ప్రాంతీయ వార్త ప్రతినిధి జులై 21 )
సదాశివనగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూతన విద్యా సంవత్సర అవగాహన కార్యక్రమంలో డా. పీబీ సత్యం
సదాశివనగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన నూతన విద్యా సంవత్సర అవగాహన కార్యక్రమంలో స్వాన్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ పీబీ సత్యం ముఖ్య వక్తగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు తమ తల్లిదండ్రుల కష్టాలను గుర్తించి, వారి పేరుకు సమాజంలో గౌరవం తీసుకొచ్చేలా విద్యను అభ్యసించాలని సూచించారు. కేవలం ప్రభుత్వ ఉద్యోగాలకే పరిమితం కాకుండా వృత్తి విద్యా కోర్సులు నేర్చుకొని స్వయం ఉపాధి పొందడంతో పాటు మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు.
సోషల్ వర్క్ కోర్సును కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మాదిరిగా ఇంటర్మీడియట్ స్థాయి నుంచే ప్రవేశపెడితే విద్యార్థుల్లో సమాజం పట్ల అవగాహన, సామాజిక బాధ్యత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. కలెక్టర్, డాక్టర్, ఇంజనీర్ వంటి ఉద్యోగాలే ఉద్యోగాలు కాదని, సమాజంలో అనేక రంగాల్లో ఉద్యోగాలు మరియు విస్తృతమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని, విద్యార్థులను వాటి వైపు కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న మానసిక, సామాజిక సమస్యల పరిష్కారంలో సోషల్ వర్కర్ల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్న ఆయన, రానున్న రోజుల్లో సోషల్ వర్క్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు మరింత ప్రాధాన్యం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సదాశివనగర్ ఎస్సై పుష్పరాజు మాట్లాడుతూ, విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా నిలుస్తూ క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నాయకులు బంటు భూమేష్, స్వాన్ ఇండియా జిల్లా నాయకులు అనిల్, పోలీసు అధికారులు సంజయ్, పండరి, కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.