PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 02 July 2026, 6:59 pm Posted by : RAVINDHAR

రైతు సమస్యలు పరిష్కరించలేని ప్రభుత్వాలు గద్దె దిగాలి : వేల్పూర్ భూమయ్య

(ప్రాంతీయ వార్త ప్రతినిధి జులై 02.)

కామారెడ్డి జిల్లా కేంద్రంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు సూర నర్సయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. రైతు, కూలీల సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వాలకు పరిపాలించే నైతిక హక్కు లేదని, అలాంటి ప్రభుత్వాలు గద్దె దిగిపోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన విత్తన చట్టం, విద్యుత్ చట్టం వంటి విధానాలు రైతు వ్యతిరేకంగా ఉన్నాయని, అవి రైతు కూలీల జీవనాధారాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని అన్నారు.
దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తూ రైతులను భూముల నుంచి దూరం చేసే విధానాలను ప్రభుత్వం అమలు చేస్తోందని భూమయ్య ఆరోపించారు. ఆదాని, అంబానీ వంటి కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలతో రైతు కూలీల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలులో విఫలమైందని పేర్కొన్నారు. మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం, భూమిలేని పేదలకు భూముల పంపిణీ, ప్రతి ఇంటికి ఉద్యోగం వంటి హామీలు ఇప్పటికీ అమలు కాలేదని అన్నారు.
భూమిలేని పేద రైతులకు భూములు పంపిణీ చేయాలని, పోడు సాగు చేస్తున్న గిరిజన రైతులకు పట్టాలు ఇవ్వాలని, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ.12 వేల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ సిటీలు, ఫ్యూచర్ సిటీ పేరుతో భారీగా ఖర్చు చేస్తున్న ప్రభుత్వం గ్రామీణ ఆర్థికాభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. రైతు, కూలీ, పేద ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షురాలు సీహెచ్ సుజాత, జిల్లా కార్యదర్శి ఏ స్వరూప, దోమట రంజిత్, పి భూపాల్, మహ్మద్ ఆరిఫ్, మహ్మద్ ఆశబిన్ తదితరులు పాల్గొన్నారు.