PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 10 June 2026, 5:08 pm Posted by : RAVINDHAR

రైతంగా పోరాటాన్ని ఉధృతం చేస్తాం – ఏకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు M బిక్షపతి

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 10

కామారెడ్డి పట్టణంలో అఖిల భారత రైతు – కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) 2వ మహాసభ ఘనంగా నిర్వహించబడింది. మహాసభ ప్రారంభానికి ముందు ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు సుర నర్సయ్య సంఘ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభకు రాష్ట్ర అధ్యక్షుడు మామిడాల బిక్షపతి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేల్పూరి భూమయ్య హాజరయ్యారు. ఈ సభకు ఏఐకేఎంఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు సుర నర్సయ్య అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా మామిడాల బిక్షపతి మాట్లాడుతూ దేశంలో రైతులు, వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడం, పంటల బీమా సక్రమంగా అమలు చేయడం, వ్యవసాయానికి అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచడం ప్రభుత్వాల బాధ్యత అని పేర్కొన్నారు. భూమిలేని వ్యవసాయ కూలీలకు ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు వారి సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతు, కూలీల హక్కుల పరిరక్షణ కోసం సంఘం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని, గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, కూలీలు ఐక్యంగా పోరాడితేనే తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు.
అనంతరం మహాసభలో పలు కీలక తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని బలోపేతం చేసి కూలీలకు సంవత్సరానికి మరిన్ని పనిదినాలు కల్పించాలని, కౌలు రైతులను గుర్తించి కౌలు కార్డులు అందజేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ వారికి వర్తింపజేయాలని, పంటలకు బోనస్ ప్రకటించాలని తీర్మానించారు. గ్రామాల్లో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి గృహ నిర్మాణ సదుపాయం కల్పించాలని, విత్తనాలు, విద్యుత్ రంగాలకు సంబంధించిన నూతన చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సంఘం భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరిపి పలు నిర్ణయాలు తీసుకున్నారు.
మహాసభ సందర్భంగా ఏఐకేఎంఎస్ కామారెడ్డి జిల్లా నూతన కమిటీని కూడా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా సుర నర్సయ్యను ఏకగ్రీవంగా నియమించినట్లు నాయకులు ప్రకటించారు. మొత్తం 11 మంది సభ్యులతో జిల్లా కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు, కూలీలు, సంఘం నాయకులు, కార్యకర్తలు మహాసభలో పాల్గొన్నారు.