PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 04 June 2026, 11:53 am Posted by : RAVINDHAR

ప్రజా పాలన ప్రగతి 99 రోజుల కార్యక్రమంలో భాగంగా 3 వ వార్డ్ లో సభ

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 04

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో గురువారం ప్రజా పాలన ప్రగతి 99 రోజుల కార్యక్రమంలో భాగంగా 3 వ వార్డ్ లో సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 3 వ వార్డు కౌన్సిలర్ కౌసర్ ఉనిస బేగం అధ్యక్షత వహించారు.
సభలో రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వార్డులో చేపట్టాల్సిన పారిశుద్ధ్య చర్యలపై విస్తృతంగా చర్చించారు. డ్రైనేజీల శుభ్రపరిచే పనులు, కాల్వల క్లీనింగ్, చెట్ల పొదల తొలగింపు, వర్షపు నీరు నిల్వ కాకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ మాట్లాడుతూ పరిశుభ్రమైన వార్డు నిర్మాణానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ మాట్లాడుతూ ప్రతి ఇంటి నుంచి తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేలా ప్రజలు సహకరించాలని సూచించారు. తడి చెత్తను ఆకుపచ్చ బుట్టలో, పొడి చెత్తను నీలం బుట్టలో వేయడం ద్వారా చెత్త నిర్వహణ సులభమవుతుందని తెలిపారు. మున్సిపాలిటీ పరిశుభ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.అలాగే వర్షాకాలంలో డ్రైనేజీల్లో చెత్త వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. వార్డులో పారిశుద్ధ్య నిర్వహణ, దోమల నివారణ చర్యలు, చెత్త సేకరణ, పరిశుభ్రమైన పరిసరాల నిర్వహణలో మున్సిపల్ సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు.
ప్రజా పాలన ప్రగతి 99 రోజుల కార్యక్రమం ద్వారా ప్రజల్లో పారిశుద్ధ్యంపై అవగాహన పెంపొందించడంతో పాటు వార్డు అభివృద్ధికి అవసరమైన సూచనలు, సలహాలు అందించినట్లు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ, ఏఎన్ఎం సుధా, రఫిక్, వార్డు అధికారి జ్యోతి, సుజాత, మెప్మా ఆర్పీలు సోని, కిరణ్, సవిత, 3 వ వార్డు సభ్యులు, మున్సిపల్ సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.