PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 16 May 2026, 2:41 pm Posted by : RAVINDAR

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై భగ్గుమన్న బీఆర్ఎస్* *మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో భారీ ధర్నా..!*

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 27

* పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపుకు నిరసనగా
వరంగల్ కాశీబుగ్గ, HP పెట్రోల్ బంకులో
బీఆర్ఎస్ మెరుపు ధర్నా

కేంద్రంలోని మోదీ, రాష్ట్రంలోని రేవంత్ సర్కార్‌లపై
నిప్పులు చెరిగిన మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్.

* కార్పొరేట్ కంపెనీలకు వేల కోట్ల అప్పులు
మాఫీ చేస్తూ, సామాన్యుడి నడ్డి విరుస్తున్న బీజేపీ పాలకులు

* ప్రజలను దోచుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను
2029లో గద్దె దించడం ఖాయం.

వరంగల్: దేశంలో, రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ రేట్లను విచ్చలవిడిగా పెంచుతూ సామాన్య ప్రజలపై పెను భారం మోపిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు శనివారం నాడు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.

ఇందులో భాగంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కాశిబుగ్గ పరిధిలో గల వివేకానంద జూనియర్ కాలేజ్ పక్కన ఉన్న HP పెట్రోల్ బంక్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు భారీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాయి. వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు శ్రీ నన్నపునేని నరేందర్ గారి నాయకత్వంలో జరిగిన ఈ ధర్నాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. “పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి”, “సామాన్యుడిపై భారం మోపిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి నశించాలి” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ గారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన మాట్లాడిన ముఖ్యమైన అంశాలు:

12 ఏళ్లలో రూ. 43 లక్షల కోట్ల దోపిడీ: ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచి సామాన్యుడి నడ్డి విరిచారని మండిపడ్డారు. గత 12 ఏళ్లలో పెట్రోల్, డీజిల్ రేట్లను ఏకంగా 32 రూపాయలు పెంచి, దేశ ప్రజల నుంచి రూ. 43 లక్షల కోట్లు కొల్లగొట్టిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీదేనని విమర్శించారు.

కార్పొరేట్ దొంగల గురువు మోదీ: నీరవ్ మోదీ, విజయ్ మాల్యా వంటి ఆర్థిక నేరగాళ్లకు చెందిన కార్పొరేట్ కంపెనీలకు వేల కోట్ల రూపాయల అప్పులను మాఫీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, సామాన్య ప్రజలను మాత్రం నిలువునా దోచుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇదేనా మోదీ.. మీ దేశం కోసం.. ధర్మం కోసం..?” అని ప్రశ్నించారు. మోదీ దేశ గురువు కాదు.. దేశ ప్రజల జేబులు కొల్లగొడుతున్న కార్పొరేట్ దొంగల గురువు అని దుయ్యబట్టారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు: గతంలో కేసీఆర్ గారిపై పొడుగు పొడుగు మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇప్పుడు పెట్రోల్‌పై సబ్సిడీ ఎందుకు మాఫీ చేయడం లేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.

పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపుపై వరంగల్ బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఎందుకు మాట్లాడడం లేదు

2029లో గద్దె దించడం ఖాయం: సామాన్య ప్రజలను ఇటు కేంద్రంలో, అటు రాష్ట్రంలో దోచుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని, 2029 ఎన్నికల్లో ఈ రెండు పార్టీలను గద్దె దించడం ఖాయమని స్పష్టం చేశారు. శ్రీరాముడు, దేవుళ్ల పేరుతో రాజకీయం చేస్తూ ప్రజలను పీడిస్తున్న ఈ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ప్రజలకు త్వరలోనే విముక్తి కలగాలని ఆకాంక్షించారు.

ఈ ధర్నా కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు మరియు భారీ సంఖ్యలో కార్యకర్తలు, సామాన్య ప్రజలు పాల్గొని తమ నిరసనను తెలియజేశారు.