PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 16 May 2026, 9:34 pm Posted by : RAVINDAR

పంట అవశేషాల దగ్ధం… రైతులకు భారీ నష్టం* *▪️అడవి లింగాలలో అదుపుతప్పిన మంటలు* *▪️కాలిపోయిన కేబుల్ వైర్లు, మోటార్ సామాగ్రి* *▪️పర్యావరణానికి ముప్పు… నేల సారానికి నష్టం* *▪️అవశేషాలు తగలబెట్టొద్దంటూ అధికారుల హెచ్చరిక

 

 

కామారెడ్డి/ప్రాంతీయ వార్త/ ఎల్లారెడ్డి: మే 27

ఎల్లారెడ్డి మండలంలోని అడవి లింగాల గ్రామంలో శనివారం పంట అవశేషాల దగ్ధం రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చింది. వరి కోత అనంతరం పొలాల్లో మిగిలిన (కొయ్య కాళ్లు) పంట అవశేషాలకు నిప్పంటించడంతో మంటలు ఒక్కసారిగా వ్యాపించి సమీపంలోని రైతుల వ్యవసాయ సామాగ్రిని దగ్ధం చేశాయి. మంటల కారణంగా కేబుల్ వైర్లు, మోటార్ పైపులు, విద్యుత్ సామాగ్రి పూర్తిగా కాలిపోయినట్లు బాధిత రైతులు తెలిపారు. నిర్లక్ష్యంగా మంటలు పెట్టడం వల్ల తమకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. వేసవి తీవ్రతతో చిన్న మంటలే వేగంగా వ్యాపించే పరిస్థితులు ఉన్నప్పటికీ కొందరు రైతులు పంట అవశేషాలను తగలబెట్టడం ప్రమాదకరమని గ్రామస్థులు పేర్కొన్నారు. పంట అవశేషాల దగ్ధం వల్ల భూమిలోని సూక్ష్మ జీవులు నశించి నేల సారవంతత తగ్గిపోతుందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గాలిలో పొగ వ్యాపించి కాలుష్యం పెరగడంతో పాటు శ్వాసకోశ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. అదుపుతప్పిన మంటలు పంటలు, చెట్లు, విద్యుత్ లైన్లు, పశువులు, నివాస ప్రాంతాలకు కూడా ముప్పుగా మారే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ నిపుణులు, సంబంధిత సిబ్బంది రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. పంట అవశేషాలను తగలబెట్టకుండా సేంద్రియ ఎరువుల తయారీలో వినియోగించాలని సూచిస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.