PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 8:10 pm Posted by : RAVINDHAR

తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలకు సన్నాహక సమావేశం,పోరాట చరిత్రను వక్రీకరించొద్దు – సీపీఎం ఎల్లారెడ్డి ఏరియా కార్యదర్శి మోతీరాం నాయక్

గాంధారి, ప్రాంతీయ వార్త:

ఈనెల 17వ తేదీ వరకు నిర్వహించనున్న తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా గాంధారి మండల కేంద్రంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. మండల వ్యాప్తంగా ప్రతి శాఖ పరిధిలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
సమావేశాన్ని ఉద్దేశించి సీపీఎం పార్టీ ఎల్లారెడ్డి ఏరియా కార్యదర్శి మోతీరాం నాయక్ మాట్లాడుతూ, తెలంగాణ సాయుధ పోరాటం భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం సాగిన మహోన్నత ప్రజా పోరాటమని అన్నారు.
ఆనాడు దొరల దోపిడీకి, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో ప్రజలు ధైర్యంగా పోరాడారని తెలిపారు. ఈ పోరాటంలో వేలాది మంది కమ్యూనిస్టు నాయకులు, కార్యకర్తలు తమ ప్రాణాలను త్యాగం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో పెద్ద ఎత్తున భూముల పంపిణీ జరిగిందని పేర్కొన్నారు.
అయితే, నేటి పరిస్థితుల్లో తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను కొందరు మతోన్మాద శక్తులు వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మోతీరాం నాయక్ ఆరోపించారు. ఈ మహోన్నత ప్రజా ఉద్యమాన్ని కేవలం హిందూ–ముస్లిం ఘర్షణగా చిత్రీకరించడం సరికాదని అన్నారు.
రజాకారులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ముస్లిం నాయకత్వం కూడా భాగస్వామ్యం అయి ప్రాణత్యాగాలు చేసిందని తెలిపారు. బందగీ వంటి నాయకులు కూడా ప్రజా పోరాటంలో తమ పాత్ర పోషించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
తెలంగాణ సాయుధ పోరాటం ప్రజల హక్కులు, భూమి, సామాజిక న్యాయం కోసం సాగిన ఉద్యమమని, ఆ ఉద్యమ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై సీపీఎం పార్టీ తన పోరాటాలను కొనసాగిస్తుందని మోతీరాం నాయక్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు సరాప్ కిషన్ రావు, మధు, ప్రకాష్ నాయక్, పోతంగల్ సాయిలు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.