PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 15 May 2026, 11:38 pm Posted by : PRANTIYA VAARTHA

ఎంపీ వద్దిరాజు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు గద్దె దిగే వరకు బీఆర్ఎస్ పోరాడుతుంది

*ఎంపీ వద్దిరాజు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు గద్దె దిగే వరకు బీఆర్ఎస్ పోరాడుతుంది*
————————————–
ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాలు గద్దె దిగే వరకు తమ పార్టీ పోరాడుతూనే ఉంటుందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు.ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇటీవల హైదరాబాద్ పర్యటన సందర్భంగా తనతో జత కట్టాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారని, వాస్తవానికి కాంగ్రెస్, బీజేపీలు ఇప్పటికే కలిసి పయనిస్తున్నాయన్నారు.ఎంపీ రవిచంద్ర కొత్తగూడెం తెలంగాణ భవన్ లో శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్సీ, పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్ రావు,మాజీ మంత్రులు వనమా వెంకటేశ్వరరావు, పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు,మెచ్చా నాగేశ్వరరావు, హరిప్రియ నాయక్,తాటి వెంకటేశ్వర్లు తదితర ప్రముఖులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.ప్రధాని మోడీ హైదరాబాద్ బహిరంగ సభలో ప్రజలు భయంతో వణికిపోయెలా మాట్లాడారని,కరోనా సమయంలో తలెత్తిన పరిస్థితులు తిరిగి వస్తాయంటూ పరోక్షంగా హెచ్చరించారన్నారు.పార్లమెంటులో తాను ప్రశ్నించిన సందర్భంగా క్రూడాయిల్, డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్ నిల్వలు రెండేళ్లకు సరిపడు అందుబాటులో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం బదులిచ్చిందని ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు.ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాక ప్రధానమంత్రి ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం శోచనీయమన్నారు.బడేభాయ్-ఛోటా భాయ్ కలిసి పని చేస్తున్నారని, దేశంలో,రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు జరగడం లేదని,ఈ రెండు పార్టీలు కూడా బీఆర్ఎస్ నాయకులను ఇబ్బందులు పెడుతున్నాయని ఎంపీ వద్దిరాజు మండిపడ్డారు.కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని,ధాన్యం కొనుగోళ్లు లేకపోవడం, వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో తాగేందుకు నీళ్లు,నిల్వనీడ లేక అన్నదాతలు అగచాట్లు పడుతున్నారని, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.చాతగాని ఈ మొద్దు దద్దమ్మ ప్రభుత్వం పోయి తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని అన్ని వర్గాల ప్రజలు బలమైన నిర్ణయానికి వచ్చారని ఎంపీ రవిచంద్ర చెప్పారు.ఇక్కడ నుంచి ముగ్గురు మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయిందని,వచ్చే ఎన్నికల్లో 1 కాదు, దాని పక్కన 0 చేర్చి 10కి 10 ఎమ్మెల్యే సీట్లను బీఆర్ఎస్ గెల్చుకోవడం ఖాయమన్నారు.మనమందరం మరింత సమన్వయంతో కలిసి కట్టుగా ముందుకు సాగుతూ సభ్యత్వ నమోదును విజయవంతం చేసుకుందామని,ఓట్ల సవరణ జాబితా సందర్భంగా తగు జాగ్రత్తగా వ్యవహరిద్దామని ఎంపీ వద్దిరాజు గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో పార్టీ నాయకులు దిండిగల రాజేందర్,మానే రామకృష్ణ,వనమా రాఘవ,కాపు సీతామహాలక్ష్మీ, దామోదర్, రాంప్రసాద్,బాదావత్ శాంతి నాయక్,సింధూతపస్వి తదితరులు పాల్గొన్నారు.