PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 16 May 2026, 1:47 pm Posted by : RAVINDAR

ఇందిరమ్మ ఇళ్లపై బిగ్ అప్డేట్ మంత్రి పొంగులేటి

 

హైదరాబాద్ ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 27

జూన్ 2వ తేదీన ఆదిలాబాద్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. తొలి విడతలో మూడు లక్షలకు పైగా ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పుకొచ్చారు. 2.90 లక్షల ఇళ్ల గ్రౌండింగ్ పూర్తి అయిందని.. ఇప్పటికే 50 వేల గృహప్రవేశాలు పూర్తి చేశామని వివరించారు. వరంగల్, ఖమ్మం జిల్లా హౌసింగ్, రెవెన్యూ అంశాలపై ఈరోజు (శుక్రవారం) సచివాలయంలో మంత్రి పొంగులేటి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు సీతక్క, కొండా సురేఖ ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడారు. మరో 2 లక్షల ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని వెల్లడించారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరు చేశామని ప్రస్తావించారు. ఐటీడీఏ ప్రాంతాలకు అదనపు ఇళ్లు కేటాయిస్తున్నామని తెలిపారు.

అర్హులందరికీ ఇళ్లు..

అర్హులందరికీ ఇళ్లు వచ్చే వరకు 3, 4 విడతలు కొనసాగిస్తామని మంత్రి స్పష్టం చేశారు. పాత ఇందిరమ్మ లబ్ధిదారులకు కూడా కొత్త ఇళ్లు మంజూరు చేస్తామని అన్నారు. 600 చదరపు అడుగుల ఇళ్ల బిల్లులు క్లియర్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో ఫారెస్ట్, సింగరేణి అడ్డంకులు సృష్టించవద్దని చెప్పారు. డబుల్ బెడ్‌రూమ్ కాలనీల్లో మౌలిక వసతులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఉచిత ఇసుక సమీప ప్రాంతాల్లో అందుబాటులో ఉంచాలని సూచించారు. ఖమ్మం, వరంగల్‌లో భూ వివాదాలపై జాయింట్ సర్వే నిర్వహిస్తామని తెలిపారు. రోవర్స్ సర్వేతో భూ సరిహద్దు వివాదాలు పరిష్కారమవుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు