ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 20
ఎల్లారెడ్డిమండలంలో రెండు రోజుల క్రితం ఈదురు గాలులు, అకాల వర్షం బీభత్సం సృష్టించాయి. గంటకు 50కి.మీ నుండి 60 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు వరి పంట నేలకొరిగింది. కోతకు సిద్ధంగా ఉన్న వరి పొలాలు, కుప్పలుగా పోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కోత దశలో పంటకు నష్టం..
రబీ పంట కోత దశలో ఉంది. కొందరు రైతులు పొలాల్లోనే కుప్పలు పోయగా, మరికొందరు కొనుగోలు కేంద్రాలకు తరలించారు. ఈదురు గాలులకు తోడు కురిసిన భారీ వర్షానికి పొలాల్లోని పంట తడిసి ముద్దయింది. కల్లాల్లో, రోడ్ల పక్కన ఆరబోసిన ధాన్యం కొట్టుకుపోయింది. తడిసిన ధాన్యం రంగు మారి మొలకెత్తే ప్రమాదం ఉండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికి వచ్చిన పంట నేలకొరకడంతో పెట్టుబడులు కూడా దక్కవేమోనని ఆందోళన చెందుతున్నారు. అంధకారంలో గ్రామాలు..
గాలుల ధాటికి ఎల్లారెడ్డి – కామారెడ్డి రహదారిపై భారీ వృక్షాలు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు, లైన్లు తెగిపడడంతో కొత్తపల్లి, తిమ్మాపూర్, హాజీపూర్, హాజీపూర్ తండా, బాలాజీ నగర్, అడవిలింగాలు, పోచంపల్లి, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలోని పలు వార్డులు అంధకారంలోకి వెళ్లాయి. రాత్రంతా ప్రజలు చీకట్లోనే గడపాల్సి వచ్చింది. తాగునీటి సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది. రోడ్లపై చెట్లు పడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. శ్రమించిన ట్రాన్స్‌కో సిబ్బంది
విద్యుత్ అంతరాయం ఏర్పడిన వెంటనే ట్రాన్స్‌కో(Transco) సిబ్బంది రంగంలోకి దిగారు. రాత్రి పగలు తేడా లేకుండా తెగిపడిన లైన్లను సరిచేసి, పడిపోయిన స్తంభాలను నిలబెట్టే పనిలో నిమగ్నమయ్యారు. చెట్లను తొలగించి మంగళవారం మధ్యాహ్నానికి చాలా గ్రామాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. మిగిలిన గ్రామాలకు కూడా త్వరగా విద్యుత్ ఇచ్చేందుకు యుద్ధప్రాతిపదికన పనులు చేస్తున్నారు. అధికారులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
